కొలువుదీరిన కొత్త కేబినెట్
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం
ప్రధానిచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పాల్గొన్న దేశ, విదేశాల ప్రముఖులు
సాచార మంత్రివర్గంతో ప్రధాని ప్రత్యేక సమావేశం
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ పిలుపు
ధ్వని ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, (న్యూస్ బ్యూరో): భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించి ఘనంగా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా ఆదివారం సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నికైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో ఆయన ఎన్నికయ్యారు. రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి ఆయన పేరును ప్రతిపాదించగా, మిగిలిన వారు ఏకగ్రీవంగా ఆమోదించారు.తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్ ను అందుకుంది బీజేపీ.తనకు మద్దతు ఇచ్చే సభ్యుల సంతకాలతో కూడిన లేఖను మోదీ రాష్ట్రపతికి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 7:15 నిమిషాలకు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేశారు. మోదీ ప్రమాణ స్వీకార నేపథ్యంలో- ఢిల్లీలో కనివినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు.రాష్ట్రపతి భవన్ కు దారి తీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకు వచ్చారు. పలు సమస్యాత్మక, సున్నిత ప్రదేశాల్లో అదనపు భద్రతను మోహరింపజేశారు. 3,000 మంది అదనపు పోలీసు సిబ్బందిని భద్రత విధుల్లోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు అయ్యారు.
కొత్త మంత్రులతో భేటీ
ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కొత్త మంత్రులతో మోదీ- నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో సమావేశం అయ్యారు. వారికి హై టీ ఇచ్చారు. హాజరైన వారిలో.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గజేంద్రసింగ్ షెఖావత్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, హెచ్ డీ కుమారస్వామి, నిర్మల సీతారామన్, సుబ్రహ్మణ్యం జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, పియూష్ గోయెల్ ఉన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాలి
ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. గత 10 సంవత్సరాల పాలనను చూసి దేశ ప్రజలు తమను ఎన్నుకున్నారని అన్నారు. వారి ఆశలను నెరవేర్చడంలో వెనుకాడొద్దని చెప్పారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుందామని, దానికి అనుగుణంగా పని చేయాలని హితబోధ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల స్తంభించిన పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత చెప్పారు.