కాబోయే కేంద్ర మంత్రులు వీరేనా?
న్యూఢిల్లీ :మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి ఆయన నివాళులర్పించారు. ప్రధానిగా ఆదివారం మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్‌ను సందర్శించి మోదీ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్, భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, నేవీ అడ్మిరల్ చీఫ్ దినేశ్ త్రిపాఠి ఉన్నారు.
30 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కీలక మంత్రులు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి మొత్తం 78 మందికి మంత్రి పదువులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. గత మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ, రోడ్స్ అండ్ హైవే మంత్రిత్వశాఖ బీజేపీ ఎంపీలకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఇక చిరాగ్ పాసవాన్, హెచ్డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్, జయంత్ చౌధరీ, జతిన్ రామ్ మంఝీ, సోనోవాల్, కిరణ్ రిజిజు వంటి వారు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసేవారి జాబితాలో ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్నాయుడికి, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ జాబితాలో ఉండొచ్చని సమాచారం.మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. ఇక ఆదివారం ఉదయం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే దిల్లీకి వచ్చారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవిండ్ కుమార్ జగన్నాథ్ రానున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వేడుకకు మొత్తం 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు.
దిల్లీలో కట్టుదిట్టమై భద్రత
మరోవైపు దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. 2,500 మందికిపైగా పోలీసు సిబ్బందిని వేదిక చుట్టూ మెహరించారు. దిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.