సిఎం చే టెట్ ఫలితాలు విడుదల
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, (న్యూస్ బ్యూరో):తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి టెట్ ఫలితాలను ప్రకటించారు. పేపర్-1లో 57,725 మంది, పేపర్-2కు 51,443 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా, 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు వివరించారు.పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు పేర్కొన్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందని చెప్పారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2కు అర్హత సాధించిన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. మరోవైపు టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష అర్జీ ఫీజు తగ్గింపుపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు.ఈ నేపథ్యంలో అర్జీదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశాన్ని తెలంగాణ సర్కార్ ఇచ్చింది. డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక బుధవారం విడుదల చేసిన టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది అర్జీ చేసుకున్నారు. ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.