స్పీకర్ గా ఓం బిర్లా

0

loksabha

తొలిరోజే రగడ

స్పీకర్​ అలా అనడమే కారణం

అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు

ధ్వని ప్రత్యేక ప్రతినిధి,,న్యూఢిల్లీ, ::లోక్​సభ స్పీకర్​గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా తొలిరోజే చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వివాదం నెలకొంది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్​ సభలో తీవ్ర ఆందోళనలు చేపట్టింది.లోక్​సభ స్పీకర్​గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యయిక పరిస్థితి గురించి స్పీకర్​ ప్రస్తావించడమే ఇందుకు కారణం. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చర్యను ఖండిస్తూ చేసిన తీర్మానంపై ప్రసంగించారు బిర్లా. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్​ సహా విపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.”1975లో అత్యయిక పరిస్థితిని విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తుంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి అభినందిస్తున్నాం. వారు ఎంతగానో పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడి బాధ్యతలను నిర్వర్తించారు. 25 జూన్​ 1975 భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఆ రోజే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి అంబేడ్కర్​ రచించిన రాజ్యాంగంపై దాడి చేశారు. భారత దేశం అంటే ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని ప్రపంచదేశాలు కీర్తిస్తాయి. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు, చర్చలను ప్రోత్సహిస్తారు. కానీ ఇందిరా గాంధీ ఇక్కడ నియంతృత్వంతో ప్రజ్వాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులను జైలులో వేశారు. దేశ మొత్తం ఓ కారాగారంగా మారిపోయింది. అప్పటి నియంతృత్వ ప్రభుత్వ మీడియా, స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థపైనా అనేక ఆంక్షలు విధించింది.”సభలో విమర్శలు, భిన్నాభిప్రాయాలు ఉండాలని, అంతేగానీ ఎలాంటి ఆటంకాలు ఏర్పరచకూడదని స్పీకర్​ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరుసగా రెండోసారి స్పీకర్​గా ఎన్నుకోవడం పట్ల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్​ సంప్రదాయాలు, విలువలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి స్పీకర్​గా పనిచేసే అవకాశం కల్పించిన సభ్యలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రిమండలిని లోక్​సభకు పరిచయం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరోవైపు ఓం బిర్లా నియామకం పట్ల సొంత నియోజకవర్గం రాజస్థాన్​లోని కోటాలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.మరోవైపు ఎమర్జెన్సీ విధింపును ఖండిస్తూ స్పీకర్​ చేసిన ప్రకటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారికి మౌనం పాటించడం మంచి పరిణామం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50ఏళ్లు దాటినా, ఇప్పటి యువతకు ఇదీ ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.మరోవైపు ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు చేపట్టారు అధికార ఎన్​డీఏ కూటమి ఎంపీలు. సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్​ ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేత పూని నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *