అధ్యయనానికి అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి ఎంత?
గడువులోగా పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదల
అధికార యంత్రాంగానికి ఇప్పటికే దిశా నిర్దేశం
అమరావతి , (ధ్వని న్యూస్ బ్యూరో):పోలవరం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు జరిగిన పనుల్లో పురోగతి ఎంత? ఇక ముందు చేపట్టాల్సిన పనులేంటి? దానికి కావల్సిన ప్రణాళిక ఏంటి? దీనిపై అంతర్జాతీయ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర పెద్దలతో మాట్లాడారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దీంతో జూన్ 29న పోలవరం రాబోతుందని అధ్యయన కమిటీ. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ఏపీ సర్కారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రాజెక్ట్‌ను సందర్శించారు సీఎం చంద్రబాబు.ప్రాజెక్ట్‌లో ఉన్న సమస్యలను అధిగమించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం రంగంలోకి దిగుతుంది. సెంట్రల్ వర్కింగ్ కమిటీ రూపొందించిన డిజైన్లను ఈ టీమ్ అధ్యయనం చేయబోతుంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇద్దరు ప్రఖ్యాత ఇంజనీర్లు, కెనడాకు చెందిన మరో ఇద్దరు ఈనెల 29న పోలవరం ప్రాజెక్టు పరిశీలించబోతున్నారు. వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణులు బృందం రిపోర్ట్ ఇవ్వబోతుంది. నలుగురు ఇంజనీర్లు సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, డ్యాం నిర్వహణ, భద్రతలో అంతర్జాతీయంగా నైపుణ్యత గలవారు. ఏడాది పాటు వీరి అధ్యయనం కొనసాగుతుంది. ప్రతీ 3 నెలలకు ఒకసారి అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు అథారిటీకి సూచనలు అందిస్తారు.ఇప్పటికే ఉన్న డయా ఫ్రమ్ వాల్ సరిచేయాలా లేక కొత్త నిర్మాణం చేపట్టాలా? ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల సీపేజ్ ఎలా కట్టడి చేయాలి? రాక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి CWC రిపోర్ట్‌పై అంతర్జాతీయ నిపుణుల బృందం అవసరమైన సూచనలు చేస్తుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.