శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
అమరావతి, (ధ్వని న్యూస్ బ్యూరో):ఏపీలోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడికి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే, ఇక్కడికి వచ్చే తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్తను చెప్పింది. స్వామివారికి సేవ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఇచ్చింది. అంతేకాదు, సామాన్య భక్తులు కూడా శ్రీవారికి సేవ చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా అవకాశం కల్పించననుంది.స్వామివారి సేవకులుగా పనిచేసేందుకు ఆన్‌లైన్‌లో బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులు మారేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి సేవకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది.సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ కోటాను రేపు అంటే గురువారం నాడు (జూన్ 27) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల స్వామివారి సేవ కోటాను రేపు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.వీటితో పాటు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వీరితో పాటు శ్రీవారి సేవకులు దర్శనం క్యూ లైన్లతో పాటు, తిరుమల వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, లడ్డూ కాంప్లెక్స్, లగేజీ కౌంటర్లు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తోంది.తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తిరుపతి, తిరుచానూరు, టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి సేవకులు వారి సేవలను అందిస్తున్నారు. తిరుమల శ్రీవారి సేవకు వచ్చేవారు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. స్వామివారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. అదే మహిళలు అయితే, ఆరెంజ్ రంగు చీర మాత్రమే ధరించాల్సి ఉంటుంది.శ్రీవారికి సేవలు అందించిన వారికి చివరి రోజు శ్రీవారి దర్శన భాగ్యం ఉంటుంది. శ్రీవారి సేవకుల సేవల్ని శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు కూడా టీటీడీ ఉపయోగించుకోనుంది. వీటితో పాటు నవనీత సేవలో భాగంగా, గోశాల ప్రాంగణాన్ని శుభ్రపరచడం, రంగోలీలు గీయడం, ఆవులకు మేత తినిపించడం వంటి అంశాలు శ్రీవారి సేవకుల సేవలో భాగమే.