అక్షరం ముక్క రాకున్నా ఆయుధం పట్టిండు

0

mansur

మడమ తిప్పని ‘మల్సూర్‌’

పోరాటం ఆయన జీవ లక్షణం

వీరుడు -ప్రజల గుండెల్లో చెరగని చిరస్మరణీయుడు

చిత్రహింసలు పెట్టినా పల్లెత్తు రహస్యం కూడా చెప్పని దీశాలి

(ధ్వని కోసం ప్రత్యేకం) :హైదరాబాద్, జూన్ 24: ఇక్కడ మనిషి,మనిషికి ఓ చరిత్ర ఉంది,కానీ..ఆ చరిత్రను రాసుకోలే.పేగు పేగుకు కరిగిపోయే ఎతలున్నయ్,కానీ..కథలు రాసుకోలే.ఎదురుదిరగడం, పోరాడటం వాళ్ల జీవ లక్షణం. ”పెద్దాయన మల్సూరు ఏమాయె’ అని అడిగితే..‘మా మల్సూరు మరణించనే లేదు’అంటుంటారు ఊరిజనం.….అవును వీరుడు మరణించడు.అక్షరం ముక్క రాకున్నా! ఆయుధాన్ని పట్టిన ధీరుడు.ప్రజల గుండెల్లో చెరగని చిరస్మరణీయుడు.చిత్రహింసలెన్నో పెట్టినా,పల్తెత్తు రహస్యం కూడా చెప్పనివాడు. అందుకే..ఈ జాగల రేషమున్నది. వారి పుట్టుకలోనే ధిక్కారమున్నది. చరిత్రను మలచిన ఉద్యమమున్నది.ఆ ప్రాంతానికే చెందిన వ్యక్తి తొట్ల మల్సూర్‌.సూర్యపేట జిల్లా నూతనకల్‌ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన మల్సూర్‌1923లో నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించాడు.చదువు,సంపద లేనోళ్లు,పదేళ్ల నుండే పెదకాపు దగ్గర పాలేరు పనిచేస్తూ బతికేవారు.తాటిచెట్లు ఎక్కడం నేర్చుకుంటూ..పశువులు కాస్తుండగా..జన్నారెడ్డి దొర చేలో పశువులు పడ్డాయి ఇగ అంతే. గడిలో వంగపెట్టి చింత బరిగెలతో సావ బాదితే సలసల మరిగే రక్తం సంఘం పెట్టమన్నది.చావో రేవో తేల్చుకోమన్నది.చివరకు సంఘం పెట్టి దొరల సంగతేందో చూడాలనుకున్నాడు మల్సూర్‌. అతలోనే ఊరును సుడిగాలి లెక్క ఓ పాట సుట్టుకుంది.బుస బుస పొంగుకుంటూ పల్లెను పాట కౌగిలించుకుంది.అరని దు:ఖానికి ఆటా పాట ఓదార్పయింది. ”చుట్టూ ముట్టు సూర్యపేట,నట్ట నడుమ నల్లగొండ,దాని పక్క గోల్కొండ,గోల్కొండ ఖిల్ల కింద..గోల్కొండ ఖిల్ల కింద నీ గోరీకడుతాం కొడుకో..నా కొడకా ప్రతాపరెడ్డి” అని గర్జించింది ఓ గళం.అదే బండి యాదగిరి గెరిల్లా దళం.ఈ పాటే దొర భూస్వామ్యంపై కొరడా జులిపించింది.చుట్టుపక్కల 70ఊళ్లల్ల జన్నారెడ్డి దొరదే భూమి.లక్షన్నర ఎకరాలు.వారి కుటుంబానిదే పెత్తనం.ప్రజలంతా పాలేర్లు,కూలీలు.‘బాంచెన్‌ దొర నీ కాల్మొక్తా..!’ అన్న ఎట్టొళ్లు, మట్టోళ్లకు సైతం ఈ పాట పౌరుషమైంది,ఉద్యమానికి బాటైంది.ఆ దళంలోనే మల్సూర్‌ గళం కొరసైంది.ఇగ పోరాటం సురువైంది.అప్పుడే దన్‌ దన్‌మంటూ..రజాకార్ల సైన్యం దిగింది.యాదగిరి దళంపై తూటాల వర్షం,తిరుమలగిరి ప్రాంతం పడమటి కొండల్లో..ఓ సూర్యుడు ఒరిగాడు.ఆ నేల కొరిగిన చేతుల నుండి చేజారిన బందూక్‌ను అందుకున్న వాడే కామ్రేడ్‌ తొట్ల మల్సూర్‌. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కూడా.ఆశయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిఖార్సయిన వ్యక్తి.ఆచరణ,కార్యాచరణ ఆయన గురితప్పని ఆయుధం, మడమ తిప్పని నాయకుడు. చిరుప్రాయంలోనే చురుకై..చాకై.. జనానికై ఉద్యమ బాట పట్టాడు. దొర దుర్మార్గపు వ్యవస్థను ఎండగట్టాడు.వెట్టిచాకిరీపై తిరగబడ్డాడు.”పోరాటమంటే..? మరేమీ కాదు.బతకటానికి ప్రయత్నించడమే..ప్రయత్నించు, ప్రతిఘటించూ..ఎక్కడో ఒక చోట నీ శత్రువు కూలిపోతాడు” అని జనాలను కూడగట్టాడు. నెల్లికుదుర్‌,కొడకండ్ల, అగామోత్కుర్‌,ఎనుబాముల రజాకార్‌ క్యాంపుపై దాడి చేసి మందుగుండ్లు,ఆయుధాలను తెచ్చి దళాలకు పంచి,దొరల పెత్తనాన్ని ఎదిరించినవాడు. ఎర్రబాడు దొర గడికే ఉదరబాంబు పెట్టినోడు మల్సూర్‌.ఎర్రజెండోళ్లకు ఎదురుబడకుండా ఏ బండ్ల పోతున్నాడో ఎవ్వరికీ తెల్వద్దని పదహారు బండ్లు గట్టి పయనమైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డిపై దాడి చేసిన వీరుడు ఎవరో కాదు మల్సూర్‌.దొర తప్పించుకుంటే.. మరో యుద్ధానికి సిద్ధమైన వ్యూహకర్త.ఎర్రబాడు భూముల్లో, ఎర్ర జెండాలు పాతి పేదలకు భూములు పంచాడు.గుల్బర్గా, అండమాన్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్నా.”దున్నేవాడిదే భూమి, గీచేవాడిదే చెట్టు” అని హర్రాజు మామ్లాలకు వ్యతిరేకంగా జంగుసైరన్‌ ఊదాడు.ఇది గీత కార్మిక,వ్యవసాయ కూలీ, పోరాటాలకు ఊతమిచ్చాయి.‘భయపడితే బతుకు లేదు;బరిగిస్తే ఎదురులేదు’అన్న మల్సూర్‌ గీత కార్మిక సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు.గీత కార్మిక హక్కులను కాలరాయడం,మూడు రకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్న తరుణంలో గీతన్నలెవ్వరు పన్నులు కట్టొద్దని పిలుపునిచ్చాడు.మహిప్యూజ్‌ విధానం రద్దు చేయాలని హక్కే మాలికానా పై ఆందోళనలు చేశాడు.నిప్పులు చెరిగే నిర్భంధంలో కూడా దళ సభ్యులను కంటికి రెప్పలా కాపాడు కున్నాడు.పాలేర్ల జీతాల పెంపుపై పోరాటం నిర్వహించి విజయం సాధించాడు.నాగారం సమితి పదవికి ఎర్రబాడు దొర కొడుకు సుధీర్‌ రెడ్డి పోటీచేస్తే ఆయన మీద వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1996లో జడ్పీటీసీగా దొరల ఏజెంట్లు నిలడితే వారిపై గెలిచి 1999 చనిపోయే వరకూ ప్రజల గుండెల్లో ప్రజా ప్రతినిధిగానే ఉన్నాడు.దొరస్వామ్యం గ్రామాల్లో అత్యధిక ప్రజల్ని కూలీలుగా తయారు చేస్తే..ఆ కూలీలే చివరికి శాశ్వత భూస్వామ్యానికి గోరీ గట్టే శిల్పులుగా మారుతారనడానికి కామ్రేడ్‌ మల్సూరు జీవితం ఒక చక్కని నిదర్శనం.జోహార్‌ మల్సూర్‌.

ఏనుగుల వీరాంజనేయులు
అధ్యక్షులు, పి జె ఏ ఆఫ్ తెలంగాణ
ఫోన్ నెంబర్ : 9951969008

(జూన్‌ 23న నూతనకల్‌లో ”యోధుడు మల్సూర్‌” జీవితం – పోరాటం పుస్తకావిష్కరణ సభ జరిగిన నేపథ్యం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *