మంత్రులకు త్వరలో ల్యాండ్ క్రూజర్లు రాక
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
కొనుగోలు చేసి విజయవాడలో ఉంచిన గత ప్రభుత్వం
ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్ , (న్యూస్ బ్యూరో):తెలంగాణ మంత్రులకు త్వరలో ల్యాండ్ క్రూజర్ వాహనాలు రానున్నాయి. అయితే ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్లు చేస్తున్నారు. అసలు డబ్బులు లేవు అని చెప్తున్న రాష్ట్ర సర్కార్ ఖరీదైన ల్యాండ్ యూజర్ వాహనాలను ఎలా కొనుగోలు చేస్తోందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. వీరందరంకీ షాక్ ఇస్తూ, వాహనాల కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ స్పష్టత ఇచ్చింది. అసలు ఈ వాహనాలను కొత్తగా కొనుగోలు చేసినవి కాదంటూ రేవంత్ సర్కార్ తేల్చి చెప్పింది. వీటిని గత ప్రభుత్వ హయాంలోనే 22 వాహనాలను కొనుగోలు చేసి సంవత్సరం పాటు విజయవాడలో దాచి పెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది.ఒక్కొక్క వాహనానికి మూడు కోట్ల రూపాయలు చెల్లించి గతి ప్రభుత్వ హయాంలోనే 22 వాహనాలను కొనుగోలు చేశారు. 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని చాలా కాలం పాటు విజయవాడలోనే ఉంచారు. ఇలాంటి క్రూజ్ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ కోసం ఏడాది పాటు సమయం తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకున్న గత ప్రభుత్వం వీటికి బుల్లెట్ ప్రూఫ్ జోడించారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటిని వాడాలని నిర్ణయించుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే వాహనాలను తెలంగాణ మంత్రులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎలాంటి వాహనాల కొనుగోలను చేపట్టలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖరీదైన ల్యాండ్ క్రూజ్ వాహనాలు మొత్తం గత ప్రభుత్వ హయాంలోనే కొనుగోలు చేసి వాటిని విజయవాడలో పెట్టారని క్లారిటీ ఇచ్చింది. గతంలో ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. తను అధికారంలోకి వచ్చిన పది రోజులకే అధికారులు తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినట్టు రేవంత్ తెలిపాడు. సీఎం రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాత వాహనాలని రిపేర్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ సమయంలోనే గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ 22 ల్యాండ్ క్రూజర్ వాహనాల గురించి తనకు తెలిసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇదే వాహనాలను తెలంగాణ మంత్రులకు ఇవ్వనున్నారు.అయితే ఈ విషయం తెలియక సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ వాహనాలను కొనుగోలు చేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ మండిపడింది. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 22 వాహనాలకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు స్పష్టం చేసింది.