మద్యంపై చోద్యమా!
కల్తీ తో శాల్తీలే గల్లంతు
రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
వందల సంఖ్యలో ఆసుపత్రుల్లో క్షతగాత్రులు
చేష్టలుడిగిన అధికార యంత్రాంగం
చెన్నై , (న్యూస్ బ్యూరో):తమిళనాడులోని కళ్లకురిచ్చి ప్రాంతంలో కల్తీ మద్యం వ్యవహారంలో ఇంకా గందరగోళ పరిస్థితి నెలకొంది. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 61కి చేరింది. జూన్ 18న కరుణాపురం గ్రామంలో కల్తీ మద్యం తాగిన వారిలో 118 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా, ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక కోరింది.మరోవైపు ఈ కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు కూడా మరణించడంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్ బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు.ఇదిలా ఉంటే, కల్తీ మందు విషాదంపై రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ ఘటనపై డీఎంకే సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కళ్లకురిచి ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే నిరసనలు చేపట్టింది.ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమైన అని విపక్షాలు మండిపడుతున్నాయి. కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో స్టాలిన్ నాయకత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నాడీఎంకే సభ్యులు ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీన్ని నీ తాము సీరియస్ గా పరిగణిస్తున్నామని మహిళా సంఘాల ప్రజాసంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం అంతటా కల్తీ వర్గానికి సంబంధించిన ఘోర కలియుగంలో 60 మందికి పైగా మృతి చెందడాన్ని నిరసిస్తున్నారు. క్రమక్రమంగా ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణ కమిటీని నియమించింది. అప్పటిదాకా వేచి చూసే ధోరణిని ఆలంబించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఖచ్చితమైన నివేదిక లేకుండా చర్యలకు ఉపక్రమిస్తే చెడు పరిణామాలు వస్తాయని ఆలోచన లేకపోలేదు. రాజకీయాలకు అతీతంగా కత్తి మద్యం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు సాగాలని డిమాండ్ చేస్తున్నాయి.దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.