బిజెపిలో “బండి” ప్రభంజనం
కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి వరకు
బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం
కరీంనగర్, (ధ్వని న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన బండి సంజయ్.. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి పదవిని అలంకరించబోతున్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. బీజేపీని గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘటనత సంజయ్‌దే అని చెప్పాలి.బండి సంజయ్ కుమార్ 1971 జూలై 11న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించారు. బండి సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసేవారు. సంజయ్‌ను తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్ లో చేర్పించారు. అప్పట్నుంచే సంజయ్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బండి సంజయ్ ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు.ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు.ఆ తర్వాత బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశారు.భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పార్టీలో పని చేశారు బండి సంజయ్.అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహించారు.2005లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ మూడుసార్లు గెలిచారు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై 14,000పైగా ఓట్ల తేడాతో తో ఓడిపోయారు.ఇక, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు, సంజయ్ 2020 మార్చి 11 నుంచి 2023 జులై 4 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన జులై 08న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యారు.బండి సంజయ్‌ని 2023 జులై 29న బీజేపీ పార్టీ అధిష్ఠానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. బండి సంజయ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా బండి సంజయ్‌ను 2024 జనవరి 03న బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.2024లో 18వ లోక్ సభ కరీంనగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాజేందర్ రావుపై 2,25,209 మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో బండి సంజయ్ కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ ప్రస్థానం స్పూర్థిధాయకమేనని చెప్పాలి. బండి సంజయ్‌కి అపర్ణతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు భగీరథ్, సుముఖ్ ఉన్నారు.