జనంతో బాబు మమేకం
రెండో రోజు కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
ప్రజల నుంచి వినతుల స్వీకరణ
అమరావతి , (ధ్వని న్యూస్ బ్యూరో):ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు తీసుకుంటున్నారు. చంద్రబాబును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కుప్పానికి వస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నియోజవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన చంద్రబాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తర్వాత పీఈఎస్ ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు, ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు.18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓం బిర్లా విజ్ఞతతో సభను నడిపించి, పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. సభను నడిపించడంలో ఓం బిర్లా విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.