చేష్టలుడిగిన వ్యవస్థ

0

telangana map

జనజీవనానికి తప్పని అవస్థ

చట్టాల మాయజాలం- సామాన్ సామాన్య జనాల హాహా

నిత్యం తప్పని హత్యలు, ఘర్షణలు

ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, జూన్ 18 (న్యూస్ బ్యూరో):భూ వివాదాలు తరచూ ప్రాణాలు బలిగొంటున్నాయి. సుదీర్ఘంగా ఈ తగాదాలు పరిష్కారం కాకపోవడంతో ఘర్షణలు తలెత్తున్నాయి. చిన్న చిన్న అంశాలతో ఇరువర్గాలు అటవీకంగా దాడులకు తెగబడుతున్నారు. మాట మాట పెరుగుతున్న ఘర్షణలు రక్తాన్ని కళ్ల చూస్తున్నాయి. ఏకంగా తోడబుట్టిన వారిని, రక్త సంబంధీకులను సైతం లెక్క చేయకుండా హత్య చేసే వరకు చేరుకుంటున్నాయి. అసలు ఈ వివాదాలకు పరిష్కారం లేదా.. వ్యవస్థలను బలోపేతం చేస్తే చిక్కులు వీడేనా? అనే విషయం చర్చనీయాశంగా మారింది.ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్‎లో ఉంటున్న భూ వివాదాలకు ఎక్కడా పరిష్కారం లభించడం లేదు. ఎన్ని మార్గాలు వెతికినా అంతిమంగా ఆక్రమణలు, ఘర్షణలే పరిష్కార మార్గమని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో దాడులు, హత్యలు పరిపాటి అయిపోయాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో భూ వివాదాలు హింసాత్మకంగా మారుతున్నాయి. కారణాలు ఏవైనా భూములపై వచ్చే సమస్యలకు పరిష్కాలు చూపకపోవడంతో అటూ అధికార, న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. రెండు వర్గాల మధ్య వచ్చే భూ వివాదానికి ఎక్కడికి వెళ్లినా సత్వర పరిష్కారం లభించకపోవడమే అసలు తగదాలకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూ తగాదాల చిచ్చుతో విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. దాయాదులు, పక్క పక్కన భూమి హక్కుదారుల మధ్య వివాదాలు సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగానే కొనసాగుతున్నాయి. దీంతో తరచూ ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వారసత్వంగా వస్తున్న ఆస్తుల పంపకాల విషయంలో పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. భూ వివాదాల్లో ఎక్కువ శాతం ఈ రకమైనవి ఉంటున్నాయి. దాయాదుల నుంచి సొంత అన్నదమ్ములు, అన్నా, అక్కా, చెల్లెళ్ల మధ్య భూ వివాదాలు రక్తాన్ని కళ్లారా చూస్తున్నాయి.వాస్తవంగా వివాదం తలెత్తగానే అధికారులను ఆశ్రయిస్తున్నప్పటికీ సత్వరం కాదు కదా తరాలు మారినా భూ వివాదాలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. అయితే ఇందుకు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కొరత కారణాలుగా చెబుతున్నారు. వివాదాలు సుదీర్ఘంగా కొనసాగడానికి రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులు కూడా కారణమని తెలుస్తోంది. మ్యూటేషన్ విషయంలో సరైన విధానాలు, విచారణలు లేకుండానే రిజిష్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా భూ వివాదాల అంశంలో అధికారుల మౌనమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక అధికారుల వద్ద పంచాయితీ తేలకపోవడంతో వివాదం న్యాయస్థానాలకు చేరుతోంది. అక్కడ అనేక రకాల కారణాలతో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‎లో పడుతున్నాయి. ప్రస్తుతం ఏదైన భూ వివాదం కోర్టు మెట్లు ఎక్కితే ఇప్పట్లో తేలదు.. 30, 40 ఏళ్లు పడుతుందనే భావన ప్రతిఒక్కరిలో వచ్చింది. దీంతో నామమాత్రంగా కోర్టులను ఆశ్రయిస్తున్నప్పటికీ ఆక్రమణల విషయంలో రెండు వర్గాల్లో ఎవరో ఒకరు సైలెంట్‎గా ఉండలేకపోతున్నారు. అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అక్రమణలకు పాల్పడడంతో మాట మాట పెరిగి ఘర్షణలు తలెత్తున్నాయి. కొన్ని చోట్ల దాడులతో ఆగుతున్నా.. మరికొన్ని సార్లు హత్యలు విషాదం నింపుతున్నాయి.అయితే ఈ భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలే సరైన పరిష్కారాలు చూపుతాయనే భావన మేధావులు, రైతు సంఘాల ప్రతినిధులు నమ్ముతున్నారు. ట్రిబ్యూనల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భూ వివాద దరఖాస్తు స్వీకరించగానే నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆక్రమణల విషయంలో జరగుతున్న ఘర్షణల అంశంలోనూ పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు సమన్వయం చేసుకోవాలని తద్వారా విలువైన ప్రాణాలు, మానవ సంబంధాలను కాపాడినట్లు అవుతుందని చెబుతున్నారు. భూ వివాదాలను ఆసరాగా చేసుకొని అధికారులు కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. భూవివాదాల పరిష్కారానికి చట్టాలు, న్యాయవ్యవస్థను ఆశ్రయించే పద్ధతులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వారసత్వ పంపకాలు, కోనుగోలు అమ్మకాలు, గట్టు పంచాయితీలు అంశంలో సత్వర పరిష్కాలు లభిస్తేనే ఈ దాడులు, హత్యలకు చెక్ పడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *