పదవుల ప్రతిష్టంభన
భగ్గుమంటున్న భాగస్వామ్య పక్షాలు
శాఖల కేటాయింపు పై నారాజ్
కేంద్ర క్యాబినెట్ లో తక్కువ పదవులు వచ్చాయి అంటున్న కొన్ని పక్షాలు
ధ్వని ప్రత్యేక ప్రతినిధి::కేంద్ర ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చుక్కలు చూపిస్తోంది. కొలువుదీరిన కొన్ని గంటల్లోనే అసమ్మతి జ్వాలలు అంటుకున్నాయి. చురచురమంటూ విస్తరిస్తున్నాయి. మారుతి జనతా పార్టీకి స్వతహాగా సొంత బలం లేని మోదీ.. దీన్ని ఎలా చక్కదిద్దుతారనేది తేలాల్సి ఉంది.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ 292 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోయినప్పటికీ- భాగస్వామ్య పక్షాల సహాయంతోఈ మేజిక్ ఫిగర్ ను అందుకుంది బీజేపీ.ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా లభించింది 240 సీట్లు మాత్రమే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మాత్రమే అధికంగా లభించిన నేపథ్యంలో టీడీపీ- 16, జేడీయూ- 12 సీట్లు అత్యంత కీలకంగా మారాయి బీజేపీకి.అదే సమయంలో కొన్ని కీలక శాఖలు, కేబినెట్ హోదాను భాగస్వామ్య పక్షాలకు కేటాయించకపోవడం.. ఇప్పుడు ఎన్డీఏలో చీలికలకు బీజం వేసింది. ప్రత్యేకించి- మహారాష్ట్రకు చెందిన శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రేస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం).. పదవుల పంపకాలపై బాహటంగానే మోదీని విమర్శిస్తున్నాయి.అజిత్ పవార్ వర్గానికి ఒకరు, ఏక్నాథ్ షిండే వర్గానికి ఏడుమంది లోక్సభ సభ్యుల బలం ఉంది. ఈ ఎనిమిది మంది ఎంపీలు కూడా ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. ఈ రెండు వర్గాలకు కలిపి ఒక కేబినెట్, మరో స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి పదవి దక్కింది మోదీ కేబినెట్లో.బుల్దానా నుంచి గెలిచిన షిండే వర్గ ఎంపీ ప్రతాప్ రావ్ జాదవ్.. ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అజిత్ పవార్ మాత్రం ఈ ఆఫర్ను వ్యతిరేకించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎనిమిది మంది సభ్యులను ఇచ్చినప్పటికీ తమకు కేబినెట్లో రెండు మంత్రి పదవులే ఇవ్వడం , అందులో ఒక్కటే కేబినెట్ హోదాతో కూడుకుని ఉండటం వారికి మంటపెట్టింది.అదే సమయంలో రెండు ఎంపీలు మాత్రమే ఉన్న కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) ఒక కేబినెట్ హోదా దక్కింది. కుమారస్వామి కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే- హిందుస్తాన్ ఆవామీ లీగ్ పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీకీ కేబినెట్ హోదా లభించింది. ఈ పార్టీ నుంచి గెలిచింది ఆయన ఒక్కరే. అయినా కేబినెట్ హోదాను పట్టుబట్టి సాధించుకున్నారాయన.దీనితో పాటు- అయిదుమంది ఎంపీలు మాత్రమే ఉన్న లోక్ జన్శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్కూ కేబినెట్ హోదా లభించింది. తమకంటే తక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలకు కేబినెట్ హోదా ఇవ్వడం, సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రెండు పదవులతో సరిపెట్టడం మహారాష్ట్ర పార్టీలకు మింగుడు పడట్లేదు.దీని ప్రభావం మహారాష్ట్ర ప్రభుత్వంపైనా పడే ప్రమాదం లేకపోలేదు. 40 ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్సీపీ చీలిక వర్గ నేత అజిత్ పవార్.. తన సొంత గూడు మహా వికాస్ అఘాడీ వైపు చూపులు సారించే అవకాశాలను కొట్టిపారేయట్లేదు. ఆయనతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆయన మళ్లీ తమతో కలుస్తారంటూ కాంగ్రెస్ నేత విజయ్ నామ్దేవ్ రావ్ వడెట్టివర్.. ధీమాగా చెబుతున్నారు.