పట్టాలెక్కనున్న పంతుల్ల పోస్టులు

డీఎస్సీ ద్వారా త్వరలోనే 11 వేల పోస్టులు భర్తీ చేస్తాం

సీఎం రేవంత్​రెడ్డి

ధ్వని ప్రధాన ప్రతినిధి
హైదరాబాదు, (న్యూస్ బ్యూరో):తెలంగాణలో డీఎస్సీ ద్వారా త్వరలోనే టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలల పదో తరగతి టాపర్లను రేవంత్‌రెడ్డి సత్కరించి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. గవర్నమెంట్​ స్కూల్స్​ విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమని వ్యాఖ్యానించారు.మట్టిలో మాణిక్యాలుగా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని సర్కార్​ స్కూల్లో చదువుతోన్న విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పదో తరగతి టాపర్ల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తాను ప్రభుత్వ బడుల్లోనే చదివానని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి, భవిష్యత్తులో మరింత బాగా చదవాలని హితబోధ‌ చేశారు. పిల్లలను చేర్పించకపోతే, పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలన్న సీఎం, ప్రొఫెసర్ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.మహిళా సంఘాలకు మధ్యాహ్న భోజన పథకం బాధ్యత : అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని తెలిపారు. పిల్లలకు అమ్మఒడి తొలి పాఠశాల కావాలన్న సీఎం రేవంత్‌రెడ్డి, చిన్న చిన్న పిల్లలను రెసిడెన్సియల్ పాఠశాలల్లో వేసి అమ్మఒడికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఒకే సిలబస్‌ ఏళ్ల తరబడి అమలు చేసేవారని, ఇకపై విద్యా కమిషన్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తామని రేవంత్‌ హామీనిచ్చారు. కొంతకాలంగా ప్రభుత్వ బడులు నిర్వీర్యం అవుతున్నాయన్న ఆయన, పాఠశాలల మూసివేత కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *