కాళేశ్వరంలో కదలిక

0
kelwswaram
file photo

ప్రాజెక్టు వద్ద కీలక పరిణామం

అన్నారంలో నీటినిలుపుదలకు పూర్తయిన మరమ్మతులు

భూపాల్ పల్లి, జూన్ 10 (ధ్వని న్యూస్ ప్రతినిధి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ అడ్మిక్చర్ గ్రౌటింగ్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. బ్యారేజీ ప్రాంతంలో ఉన్న ఇసుక తొలగింపు పూర్తయింది. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.అన్నారం బ్యారేజీలో ఈ వానాకాలం పూర్తయ్యేనాటికి ఎన్డీఎస్ఏ అనుమతితో నీటిని నిల్వచేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికిప్పుడు వరదవచ్చినా తట్టుకునే విధంగా అన్నారం బ్యారేజీ సిద్ధం చేస్తున్నారు. బ్యారేజీలో 28, 38, 35, 44 వెంట్లలో లీకేజీలు ఏర్పడగా వరంగల్ చెందిన ఎన్ఐటీ ప్రొఫెసర్ల బృందం సలహాలతో తాత్కాలికంగా వాటిని నియంత్రించారు. తొలుత లీకేజీ ఏర్పడిన వెంట్లలో కెమికల్ గ్రౌటింగ్ చేసిన అధికారులు ఆ తర్వాత సిమెంట్, వెంటోనేట్ గ్రౌటింగ్ పూర్తిచేశారు.వీటితో పాటు వారం క్రితం ప్రారంభించిన సిమెంట్ అడ్మిక్చర్ గ్రౌటింగ్ పనులు పూర్తి చేశారు. కెమికల్ గ్రౌటింగ్‌తో లీకేజీలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నా, సిమెంట్, వెంటోనేట్ గ్రౌటింగ్ వల్ల అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్రదేశాలకు గోడకట్టినట్లు ఏర్పడి పూర్తి స్థాయిలో లీకేజీల సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రౌటింగ్‌తో పాటు బ్యారేజీకి ఎగువన, దిగువన వేల మీటర్ల మేర బాతోమెట్రిక్ సర్వే పూర్తి చేసిన అధికారులు ఎన్డీఏస్‌ఏకు సర్వేను నివేదించినట్లు తెలిసింది.బ్యారేజీకి ఎగువన పిల్లర్లకు ముందున్న ప్లాట్‌ఫాంపై పేరుకు పోయిన ఇసుక తొలగింపు పనులు ఇప్పటికే పూర్తి చేశారు. స్ట్రక్చర్ ఏరియా, లాంచింగ్ ఆఫ్రాన్లపై ఉన్న ఇసుక తొలగింపు పనులు సైతం చివరి దశకు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఎదురైన పరిస్థితులు అన్నారం బ్యారేజీకి తలెత్తకుండా ఎన్‌డీఎస్‌ఏ సూచనల ప్రకారం మరో టెస్టుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లీకేజీ ఏర్పడిన 28,38, 35, 44 వెంట్లలో బోర్వెల్ ద్వారా 25 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి బ్యారేజీ కింద ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు.పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్యూపీఆర్‌ఎస్) నిపుణుల బృందం ఈ పరీక్షలు చేపట్టనున్నారు. ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులతో పాటు సాయిల్ టెస్టుల ద్వారా బ్యారేజీ శాశ్వత రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఎన్డీఎస్‌ఏ సూచించినట్లు తెలిసింది. ఈ నమూనాలతో సాయిల్ క్లాసిఫికేషన్, సాయిల్ డెన్సిటీ, మట్టి తేమ శాతం, ఆటర్‌బర్గ్ లిమిట్స్ పరీక్షలు చేయనున్నారు.సాయిల్ క్లాసిఫికేషన్ ద్వారా బ్యారేజీ కింద ఉన్న మట్టి రకంతో పాటు దాని నాణ్యత, మట్టెలో ఉన్న తేమ శాతాన్ని పరీక్షించనున్నారు. అటర్‌బర్గ్ లిమిట్స్ టెస్టు ద్వారా బ్యారేజీలో నిల్వ ఉన్న నీరు మట్టిని తాకినప్పుడు నేల స్వభావం ఏమిటనేది తెలుసుకోనున్నారు. ఈ టెస్టుల ఫలితం. బ్యారేజీ నిర్మాణానికి ముందుకు చేసిన టెస్టులతో పోల్చి బ్యారేజీ పరిస్థితి ఏమిటనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయనున్నారు.సీసీ బ్లాకులు జారి పోవడానికి కారణాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకోనున్నారు. మేడిగడ్డలో సీపేజీ సమస్య అధికం కావడం వల్లే పిల్లర్లు కుంగుబాటుకు గురికాగా ఆ సమస్య అన్నారం బ్యారేజీకి తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో మట్టి నమూనాలు సేకరించేందుకు యంత్రాలు, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *