pradhani

ప్రధాని అయ్యాక మోదీ తొలి సంతకం

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రధాని

పి ఎం కిసాన్ పథకం కింద నిధుల జమ

ధ్వని ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ ,జూన్ 10 (న్యూస్ బ్యూరో):
భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడో సారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైల్​పై తొలి సంతకాన్ని చేశానని మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటామని ఆయన చెప్పారు.కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జరిగింది. ఈసందర్భంగా అన్ని శాఖల వారీగా తొలి 100 రోజుల ప్రణాళికపై ఎన్డీఏ సర్కారు దృష్టి సారించనుంది. ఈసారి మోదీ సర్కారులో మంత్రులుగా చేరిన వారికి సోమవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా విందు ఇచ్చారు. ఇక కేంద్ర మంత్రుల్లో ఎవరెవరికి ఏయే శాఖలను కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైల్వే శాఖలను తమకు ఇవ్వాలని నీతీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ కోరినట్లు తెలిసింది. అయితే కీలకమైన రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకునే ఛాన్స్ ఉంది. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 72 మంది సభ్యులతో కూడిన కేంద్ర మంత్రి మండలితో కలిసి మూడోసారి ప్రధానిగా మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 11 పోర్ట్ ఫోలియోలను ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలకు కేటాయించారు. ఈసారి కేంద్ర మంత్రి వర్గంలో బిహార్‌కు 8 కేబినెట్ బెర్త్‌లు, యూపీకి 9 మంత్రి పదవులు ఇచ్చారు.ఎన్నికల సమయంలో కూడాభారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలుస్తుందని ప్రకటించారు. అనేక హామీలను గుప్పించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచారంలో ఆయన రైతుల హక్కులకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు . వారి మెప్పును పొందారు. తొలి సంతకాన్ని కూడా రైతుల పక్షపాతిగా నిరూపించుకునేందుకు కార్యాచరణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *