పారదర్శకతకు పట్టం కట్టేదెన్నడు?

0
parlament
file photo

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషయరీ. నిర్మహమాటంగా వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచే బాధ్యత మీడియాది. ఈ నాలుగు స్తంభాలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్ల చేసే వ్యవస్థలు. 143 కోట్ల ప్రజల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగ సంరక్షణకు ఆశా దీపాలు. ఎన్నికల నిర్వాహణ అనగానే దేశ ప్రజలందరికీ గుర్తొచ్చే పేరు టిఎన్ శేషన్. ఎన్నికలను పారదర్శంగా దర్శకంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. పౌర హక్కులు అనగానే తార్కుండే, కన్నాభిరాన్, బాలగోపాల్… ఇలా ఎందరో. వీరంతా పీడిత తాడిత ప్రజల ప్రజా స్వామిక హక్కుల కోసం, వ్యయ ప్రయాసలకోర్చి, ధైర్యంగా పోరాడినవారు. మానవతావాదులు అనగానే ఎస్. ఆర్. శంకరన్, బి. డి. శర్మ,… ఇలా ఎందరో. న్యాయాధీశుల తీర్పుల విషయానికొస్తే మనల్ని ప్రభావితం చేసే పరిపూర్ణ వ్యక్తిత్వం కలవారు కొద్దిమందే కనిపిస్తారు. గొప్ప ఫిలాసఫర్లు,న్యాయ మూర్తులు, జర్నలిస్టులు,మేధావులు,చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, త్యాగధనులు, ఉద్యమకారులు, మహోన్నత వ్యక్తిత్వం గల మరెందరికో జన్మనిచ్చిన నేల ఇది. వీరంతా భారత రాజ్యాంగాన్ని, చట్టాలను సరిగా అమలు చేసి ప్రజలకు వాటి ఫలాలు అందాలని ఆకాంక్షించినవారు. అమలుకు కృషి చేసిన వారు. వీరే గనుక సముచిత స్థానాలలో ఉండి ఉంటే, లేదా జీవించి ఉంటే పరిస్థితి ఎంత బాగుండేదో కదా! అని ఇప్పటికీ అనిపిస్తుంది. వీరంతా భారత దేశ చరిత్రలో చిరస్మరణీయులు.ఈ సందర్భంలో గుర్తొచ్చే పేరే సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి, పద్మ విభూషణ్ పి. బి. గజేంద్రగడ్కర్. వీరి గురించి ప్రచారంలో ఉన్న ఒకానొక కథ ఆదర్శం, అనుసరణీయంగా ఉంటుందన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. అదేమంటే ఒకానొకసారి వీరి ఇంటికి ఉదయం పూట వెళ్లిన ఒక పెద్దమనిషి, గడ్కర్ గారు దినపత్రిక చదవడం గమనించాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే, అది సుమారు రెండు మూడు నెలల కిందటి పాత పేపర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. సంశయం తీర్చుకునేందుకు ఇదేమిటి? ఇది ఈరోజు పేపర్ కాదు కదా! పాత పేపర్ ఎందుకు చదువుతున్నారు? అని అడిగేశాడు. గజేంద్ర గడ్కర్ గారు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. పాత పేపర్ చదివితే అలనాటి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అదే ఈరోజు పేపర్ చదివితే, సమకాలీన అంశాలు, నా ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దానివలన నేను ఇచ్చే తీర్పులపై ఆ ప్రభావం పడుతుందేమోనన్న ఆలోచన కారణంగా పాత దినపత్రికను చదువుతున్నాను అన్నారట. ఇది అందరం గమనించాల్సిన గొప్ప విషయం ఇది. న్యాయమూర్తిగా, న్యాయస్థానంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకతీతంగా తీర్పులు రావాలనే ఆకాంక్ష కారణంగానే తమను తాము చట్టపు, చట్రంలో బిగించుకొని తీర్పులిస్తుంటారు. అందుకు ఇదొక గొప్ప ఉదాహరణ.వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అన్నది భారత శిక్ష సంస్కృతి గొప్పతనం.కానీ ఇటీవల వస్తున్న తీర్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. బాబ్రీ మసీద్ – రామ జన్మభూమి కేసు లో తీర్పు ఇచ్చిన న్యాయ న్యాయ మూర్తులకు వెనువెంటనే రాజకీయ పదవి లభించడం చర్చ నీయాంశoగా మారింది. అదే బిల్కీస్ బనో కేసులో నిందితులకు హైకోర్టు జైలుకు పంపింది.కానీ గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల ఆదేశించి బయటకు పంపింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టి బాధితురాలికి సుప్రీం కోర్ట్ అండగా నిలవడం ప్రశంసలు కురిపించింది. వివిధ కారణాలతో అభియోగం మోపబడిన వ్యక్తి, అభియోగాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఓకే కోర్టులో న్యాయమూర్తులు మారడంతో తీర్పులు భిన్నంగా ఉంటున్నాయి. న్యాయమూర్తులు అందరూ భారత శిక్షాస్మృతినే అమలు చేయాలి,చేస్తున్నారు. కానీ, సంబంధిత కేసుల విషయంలో శాస్త్రీయ విశ్లేషణ, మానవీయకోణం పరిశీలనా విధానాల్లో మార్పులు ఉన్నందునే తీర్పులు కూడా వేరువేరుగా ఉంటున్నాయి. ఇది సమాజంలో ఆందోళన కలిగించే విషయమే. న్యాయమూర్తులకు రాజకీయ నాయకుల బెదిరింపులు, తమ వ్యతిరేకంగా తీర్పు వస్తున్న సందర్భంగా జరుగుతున్న న్యాయమూర్తులు హత్యలు అత్యంత విషాదకరం. వీటిపై సరైన విచారణ జరగకపోవడం బాధాకరo . ఇది దేశన్యాయ వ్యవస్థకే పెను సవాల్ వంటిదని మరువరాదు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించగల వారే చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచి పోతారు. ప్రలోభాలకు గురై తీర్పు ఇచ్చేవారు ప్రజల మనోఫలకాలపై దోషులుగా మిగిలిపోతారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులిస్తే భారత న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగ మూలాలకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అనుమానాలకు తావుండదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించవలసిన వారు, నిత్య జాగరూకులై ఉండడం ఎంతో అవసరం. ప్రజలను ప్రేమించే వారు, వ్యవస్థను రక్షించాలి అనుకునేవారు మాత్రమే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలరు. అప్పుడే చరిత్ర పుటలలో వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

✍🏼 రమణాచారి,సామాజిక విశ్లేషకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *