ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
పక్కా ఆధారాలతో కోర్టుకు పోలీసులు!
హైదరాబాద్ ,(ధ్వన్యూస్ బ్యూరో):తెలంగాణలో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పక్కా ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇప్పటికే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటకిరాగా.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు.ఈ కేసుకు సంబంధించి మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్‌లు, సీడీ, పెన్ డ్రైవ్‌లను పోలీసు కోర్టు ముందు ఉంచారు. ఫైనల్‌గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. అనంతరం మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్ ల పై విచారణ వాయిదా పడింది.మరోవైపు తిరుపతన్న, భుజంగ రావ్‌బెయిల్ పిటిషన్‌లపై న్యాయస్థానంలో విచారణ జరగబోతోంది. 90 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను పూర్తిచేసుకున్నామని, దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే.. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ గత గురువారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి.. పీపీ వాదనలతో ఏకీభవిస్తూ.. నిందితుల బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.