కొలువుల జాతర
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
లిస్ట్ లో డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు
ఇతర పలు ముఖ్యమైన అంశాలకు చర్చ మరియు ఆమోదం
ధ్వని ప్రధాన ప్రతినిధి
అమరావతి, (న్యూస్ బ్యూరో):ఏపీలో సోమవారం సమావేశమైన కూటమి తొలి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన మంత్రివర్గ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాలపై వేర్వేరుగా చర్చ జరిగింది. ఇందులో 2024 మెగా డీఎస్సీ నిర్వహణ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ముందుగా మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని డిసెంబర్ 10 కల్లా దీన్ని ముగించాలని నిర్ణయించారు. అలాగే వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అటు రాష్ట్రంలో ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెన్షన్ల పెంపుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.దీంతో పాటు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తారు. అలాగే చంద్రబాబు ఐదో సంతకం అయిన నైపుణ్యాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు విజయవాడలో ఉన్న వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ గా మార్చాలని నిర్ణయించారు.మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు, శాఖలు నిర్వీర్యం అయ్యాయని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా ఏడు ప్రధాన శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్,విద్యుత్ శాఖలపై ఈ నెలాఖరు నుంచి శ్వేత పత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే గంజాయి అరికట్టడంపైనా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఏపీలో గంజాయి నిర్మూలనకు సూచనలు చేసేందుకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో మంత్రులు అనిత,లోకేష్,కొల్లు రవీంద్ర,సత్య కుమార్,సంధ్యా రాణి సభ్యులుగా ఉంటారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పాట్ హోల్స్ ను వెంటనే పూడ్చాలని నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.చివరిగా కేబినెట్ భేటీ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు మాట్లాడారు. ఇందులో వారికి తమ శాఖలపై సాధ్యమైనంత త్వరగా పట్టు పెంచుకోవాలని సూచించారు. మంత్రులు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఉండాలన్నారు. శాఖల వారీగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వారికి పలు సూచనలు చేశారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ శాఖలకు మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు మంత్రును కోరారు.