ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం త్వరలోనే నోటిఫికేషన్ల జారీ
హైదరాబాద్ (ధ్వని న్యూస్);: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టిసారిం చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చుతున్నారు. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉంది. సమస్యను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగానూ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్ఎస్ ఆర్‌బీ) త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా సర్జన్లను నియమించనున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. అలాగే, వివిధ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించే స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఎంహెచ్ఎస్ ఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
.