కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు
న్యూఢిల్లీ :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. విమానయాన అభివృద్ధికి గత పథకాలను కొనసాగిస్తూ, మరిన్ని పథకాలు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని, భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పౌరవిమానయాన బాధ్యత అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కేబినెట్‌లో అత్యంత చిన్న వయస్సులో ఉన్న తనపై బాధ్యత పెట్టారని, రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. యువతపై, ప్రధానికి ఉన్న నమ్మకమేంటో దీంతో అర్థమవుతుందని ఆయన కొనియాడారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి తాను నేర్చుకున్నానని తెలిపారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. విమానాశ్రయాల నిర్మాణానికి నిధులను త్వరితగతిన కేటాయిస్తామని తెలిపారు.విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. సామాన్యుడికి సైతం విమనప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయాణికుడికి సౌకర్యం, భద్రత ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పని చేశానని. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాని తెలిపారు.ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగా చేయడానికి చర్యలు తీసుకుంటామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. టైర్2, టైర్3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకురావడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. అశోక్ గజపతి రాజు గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయన హయాంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంతో పాటు, ఏపీలోనూ విమానయానానికి అద్భుతంగా పునాదులు వేశారని పేర్కొన్నారు.ఉడాన్ స్కీమ్ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అమలు చేసి టైర్2, టైర్3 సిటీలతో పాటు సామాన్యుడికి విమానయాన అవకాశం కల్పించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈపథకాన్ని మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ఓ వైపు మోదీ, మరో వైపు చంద్రబాబు లాంటి విజనరీ లీడర్స్ ఉండటం తనకు కలిసొచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడి విమానయాన శాఖ కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.