హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం
హైదరాబాద్, (ధ్వని న్యూస్):రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని హయత్నగర్, ఎల్బీనగర్, నాగోలు, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. దీంతో రహదారులపై వరద నీరు వచ్చి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు దంచికొట్టాడు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళ వరుణుడు నగరవాసులను పలకరించాడు. వివిధ ప్రాంతాల్లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసింది. హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోలు, చైతన్యపురి, గడ్డి అన్నారం, దిల్సుఖ్నగర్, మలక్పేట్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఛత్రినాకా, హనుమాన్ నగర్లో డ్రైనేజీ పొంగిపొర్లింది. దీంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైనే డ్రైనేజీ ప్రవహించడంతో దుర్వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడిన ప్రతిసారీ ఇదే తరహాలో డ్రైనేజీలు పొంగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్, చిలకలగూడ, రైల్వే స్టేషన్ మనోహర్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లి తిరిగి వచ్చే విద్యార్థులు సైతం వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రైల్వే స్టేషన్ వద్ద వర్షం కారణంగా కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలో గాలివాన, వడగళ్లు, ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టించాయి. శివంపేట మండలంలోని లింగోజిగూడ తండాలో కోళ్ల ఫారం భారీ వర్షం దాటికి కుప్పకూలింది. మరో చోట రేకుల ఇంటి రేకులు మొత్తం లేచిపోయాయి. వడగళ్ల వాన, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి క్షేత్రంలో కురిసిన భారీ వర్షానికి తిరు వీధిలో నిలిచిన నీటిలో ఆలయం తడిసి కృష్ణ శిలా రూపు ఆకట్టుకుంది. సాయంత్రం కురిసిన వర్షానికి ఆలయ ప్రాకారాలు, మండపాలు, మాడ వీధిలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఇలా తడిసిన ఆలయం కొత్తరూపు సంతరించుకుంది. భక్తులు వర్షంలో తడుస్తూనే లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మండలంలో సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంది పడ్డారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీలలోకి వరద నీరు వచ్చి డ్రైనేజీ రోడ్లుపై పారుతుంది.