డైలమాలో రాహుల్ గాంధీ

0

rahul

న్యూఢిల్లీ , (న్యూస్ బ్యూరో):పార్లమెంట్​ సభ్యుడిగా ఏ స్థానం నుంచి కొనసాగాలో అర్థం కాక అయోమయంలో పడినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ పార్లమెంటు స్థానాల నుంచి రాహుల్‌ గాంధీ గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఏ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాని రాహుల్​ అన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు ఆనందిస్తారని చెప్పారు. ప్రధాని మోదీకి వచ్చినట్లుగా తనకు దేవుడి నుంచి సూచనలు ఏం రావని ఎద్దేవా చేశారు. వయనాడ్‌లో బుధవారం భారీ రోడ్‌షో నిర్వహించిన రాహుల్​, కారు టాప్‌పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలాది మంది యు డి ఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్‌షో సాగిన దారిపొడవునా ఇరువైపులా బారులుతీరారు. ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదివరకే రాయ్‌బరేలీ వెళ్లిన ఆయన బుధవారం వయనాడ్‌లోనూ పర్యటించారు.
‘సంబరాల్లో మోదీ బిజీ’…బీజేపీ పాలనలో దేశంపై ఉగ్రదాడులు చేస్తున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతలు నెలకొంటున్నాయని, సాధారణ పరిస్థితులే ఉంటున్నాయని బీజేపీ చెబుతోంది. అవన్ని తప్పుడు వాదనలే అని గత మూడు రోజులుగా జరుగుతున్న ఉగ్రదాడుల ద్వారానే తెలుస్తుంది. అభినందన సందేశాలకు రిప్లై ఇచ్చే పనిలో నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. అందుకే జమ్ముకశ్మీర్​ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు కూడా వినలేకపోతున్నారు’ అని ఎక్స్​ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇన్​ఛార్జ్​ పవన్​ ఖేడా కూడా ప్రశ్నించారు. పాకిస్థాన్​ నాయకులకు అభినందన సందేశాలకు సమాధానాలు చెప్పడానికి మోదీకి సమయం ఉందని, ఉగ్రదాడులను ఖండించడానికి మాత్రం లేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *