మెగా బ్రదర్స్ తో మోదీ సందడి
ధ్వని ప్రధాన ప్రతినిధి
అమరావతి, (న్యూస్ బ్యూరో):ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ తో సందడి చేసారు. ప్రత్యేకంగా చిరంజీవి-పవన్ చేతులు పైకి లేపి అభివాదం చేసారు. పవన్ ను ప్రధాని సమక్షంలోనే చిరంజీవి ప్రశంసించారు. మెగా బ్రదర్స్ ఇద్దరిని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమయ్యారు.ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ఆలింగనం చేసుకున్న ప్రధాని అభినందించారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతీ మంత్రి నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక..చంద్రబాబు తరువాత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పాదాభివందన చేసే ప్రయత్నాన్ని వారించారు. పవన్ ఆ వెంటనే అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసారు.మెగా బ్రదర్స్ తో సందడి మంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం తరువాత ప్రధాని తో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధానిని తన అన్నయ్య వద్దకు తీసుకెళ్లారు. చిరంజీవిని చూసిన వెంటే ప్రధాని అభినందించారు. ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి, పవన్ ను కలిపి ఇద్దరు చేతులు పైకి లేపి అభివాదం చేసారు. మెగా బ్రదర్స్ భజం తడుతూ అభినందించారు. ఆ సమయంలో తమ్ముడి సమర్ధత గురించి చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం తరువాత ఈ సన్నివేశం చూస్తూ మెగా కుటుంబం ఉద్వేగానికి లోనైంది.ఇదే సమయంలో మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ సందడి చేయటం..ప్రమణ స్వీకారం వేళ ప్రత్యేకార్షణగా నిలిచింది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు నాందిగా నిలిచిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో మూడు ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్ పైన ఆశతో ఉంది. దీంతో..రాష్ట్రంలో మంచి ప్రజాకర్షణ ఉన్న వ్యక్తులుగా మెగా బ్రదర్స్ ఉన్నారు. పవన్ – మోదీ మధ్య ఇప్పటికే ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవిని సైతం తమతో కలుపుకోవాలనేది ప్రధాని మోదీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో..మెగా బ్రదర్స్ సహకారంతో బీజేపీ రానున్న రోజుల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాల పైన ఆసక్తి మొదలైంది.