ముగిసిన ఎన్నికల కోడ్

0

batti vik
పరుగులు తీయనున్న పాలన

పాతుకుపోయిన అధికారుల బదిలీలు

సంక్షేమం -అభివృద్ధి జోడెడ్లుగా సాగాలని సర్కారు నిర్ణయం

అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు, సమీక్షలు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే ఆరుగారంటీల అమలుపై దృష్టి పెట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచుతూ అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించుకునే వారికి జీరో బిల్లు మంజూరును అమల్లోకి తెచ్చారు. హామీ ఇవ్వక పోయినప్పటికీ డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల బకాయిలను మంజూరు చేశారు. 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఒకసారి గా పాలనకు బ్రేక్ పడింది. పాలనలో కొంత స్తబ్దత ఏర్పడింది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నెల 9 నుంచి పాలనను పరుగులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు ప్రణాళికలు రూపొందించారు. వరుస సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలకు రంగం సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. మూడేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులందరినీ కదిలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 9న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు కార్యాచరణ ప్రారంభమైంది, ఈనెల చివరకు ఈ ప్రక్రియ ముగియనుంది. సంక్షేమం- అభివృద్ధి జోడేడ్ల తరహాలో రాష్ట్రంలో పాలన ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజాపాలన అందించడం లో అధికారుల భాధ్యత తీవ్రంగా ఉంటుంది. అధికారుల పనితీరుపై ప్రతి నెలా నివేదికలు తెప్పించుకొని సమీక్షలు నిర్వహించాలని, అశ్రద్ద వహించే అధికారులను పక్కకు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

మధిరలో ప్రారంభమైన డిప్యూటీ సీఎం వరుస సమీక్షలు

గత ప్రభుత్వాల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా హామీ ఇచ్చిన అన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం  మధిరలో మున్సిపల్, విద్యుత్తు,  నీటిపారుదల శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

12 ,13న ఖమ్మంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన మంత్రుల సమీక్షలు, క్షేత్ర పర్యటనలు

నీళ్లు, నియామకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన గత పాలకులు ఖమ్మం జిల్లాలో ఇందిరా, రాజు సాగర్ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 12న సీతారామ సాగునీటి ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్ కు సాగర్ కాల్వ అనుసంధానం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు  సాగునీటి సరఫరా అంశాలను సమీక్షించనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా వైరా రిజర్వాయర్ కు సాగునీటిని మళ్లించేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కమల్లు ఎన్నికల కోడ్ కు ముందే   75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనుల పైన సమీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మంలో సమీక్ష చేపట్టిన మరుసటిరోజే ఈనెల 13న సాగునీటి ప్రాజెక్టుల పనులు, వాటి ప్రగతిని తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు సంయుక్తంగా క్షేత్ర పర్యటన చేపట్టనున్నట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పరిధిలో దుమ్ముగూడెం నుంచి జూలూరుపాడు వరకు జరుగుతున్న పనులు, ఏనుకూరు నుంచి వైరా రిజర్వాయర్ కు నాగార్జునసాగర్ ఎడమ కాలువను లింక్ చేయడం వంటి పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిసింది. ఇదే సందర్భంలో విద్యాశాఖ పరిధిలోని  మన ఊరు- మనబడి, సంక్షేమ శాఖలోని వివిధ పథకాల అమలు తీరును సైతం పరిశీలించనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *