హ్యాట్రిక్ పిఎం నేడే ప్రమాణస్వీకారం
ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సారధిగా దామోదర దాస్ నరేంద్ర మోదీ
దేశ , విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం
తరలిరానున్న అతిరథ మహారథులు
పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభృతులు
దిల్లీలో హైఅలర్ట్
భద్రత కట్టుదిట్టం
ధ్వని ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, జూన్ 8 (న్యూస్ బ్యూరో):మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈనెల 9వ తేదీన ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దాంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు.ఈ కార్యక్రమానికి పొరుగుదేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. భారతదేశానికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు మరియు ప్రముఖులను కూడా ఆహ్వానించారు.వారు నిర్దేశించిన మార్గాల్లోనే హోటల్ నుంచి వేదిక వద్దకు వస్తారని అధికారులు తెలిపారు. ఆ మార్గాల్లో స్నైపర్లు, పోలీసు సిబ్బంది పహారా కాయనున్నారు. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు. అలాగే నేతలు బస చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉన్నాయి. స్కానింగ్ వంటి వాటికోసం కృత్రిమమేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు.ఇక రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు. మోదీ సహా ఉన్నతస్థాయి వ్యక్తుల రాకపోకల వేళ.. వేదిక వద్దకు వెళ్లే పలు మార్గాలను మూసివేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. అలాగే దిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 8 వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయి. ఆహ్వానితులే కాకుండా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. ఫలితంగా ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోనున్నాయి.