రచ్చ వద్దు- రాజీ హద్దు
కుమారుడికి విజయమ్మ హితవు
అమరావతి, ( ధ్వని న్యూస్ బ్యూరో):ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. వైసీపీ ఓటమి తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ, జనసేన చేరుతున్నాయి. 2014 తరహా ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కానుంది. ఇదే సమయంలో అనూహ్య ఫలితాలు చవి చూసిన జగన్ పార్టీ భవిష్యత్ పై చర్చ మొదలైంది. ఈ సమయంలోనే తాడేపల్లి జగన్ నివాసం కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఊహించని ఫలితాలతో….ఈ ఎన్నికల్లో జగన్ ఊహించని పరాజయం ఎదుర్కొన్నారు. 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మూడు పార్టీల కూటమితో పాటుగా చెల్లి షర్మిల సైతం జగన్ కు వ్యతిరేకంగా పని చేసారు. జగన్ టార్గెట్ గా పలు విమర్శలు చేసారు. ఈ పరిణామాల నేపద్యంలో తన కుమారుడు మరియు కుమార్తె మధ్య రాజకీయ వైరుధ్యం రావడం పట్ల వైఎస్ విజయమ్మ కలత చెందుతున్నార. ఈ నేపథ్యంలో గొడవలు వద్దని హితోపదేశం చేసినట్టు సమాచారం.జగన్ ఎన్నికల ముందు సిద్దం బస్సు యాత్ర ప్రారంభం వేళ ఇడుపుల పాయలో విజయమ్మ తన కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తరువాత అమెరికా వెళ్లిన విజయమ్మ తరువాత ఒక వీడియో విడుదల చేసారు. కడప నుంచి పోటీ చేస్తున్న తన కుమార్తె షర్మిలకు మద్దతివ్వాలని కోరారు. ఎన్నికల వేళ ఆ వీడియో వైరల్ అయింది.
విజయమ్మ ఎంట్రీతో….ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు. పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదని వ్యాఖ్యానించారు. ప్రజల తరుపున నిలబడుదామని పిలుపునిచ్చారు. 40 శాతం ఓట్లు వైసీపీకి పోలైన అంశాన్ని గుర్తు చేసారు. అయితే, జగన్ ఓటమి వెనుక అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ నమ్ముకున్న కోటరిలోని ప్రముఖుల నుంచి పథకాల లబ్ది దారులు ఆశించిన స్థాయిలో మద్దతుగా నిలవలేదనే విషయం స్పష్టం అవుతోంది. జగన్ సోదరి షర్మిల, సునీత సైతం జగన ను ఓడించాలని పిలుపునిచ్చారు. తిరుగులేదని భావించిన కడప జిల్లాలోనూ జగన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. షర్మిల, సునీత ప్రచారం కూటమికి ఎన్నికల్లో కలిసి వచ్చింది.
రాజీ ఫార్ములా ఫలించేనా….ఈ సమయంలో విజయమ్మ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చినట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఓటమి తరువాత జగన్ వద్దకు విజయమ్మ రావటం చర్చకు కారణమైంది. ప్రధానంగా కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు..తన ఇద్దరు బిడ్డల మధ్య పెరిగిన గ్యాప్ పైన విజయమ్మ ఆవేదనతో ఉన్నట్లుగా సమాచారం. దీంతో..రాజీ ప్రయత్నాల దిశగా విజయమ్మ అడుగులు వేస్తున్నారనేది పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ స్థాయిలో నష్టం జరిగిన తరువాత రాజీ సాధ్యమా..విజయమ్మ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా అనే చర్చ మొదలైంది. ఇక..ఇప్పుడు జగన్ తిరిగి తన పార్టీని నిలబెట్టుకోవటం తో పాటుగా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు జగన్ తీసుకొనే ప్రతీ నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది