ముగ్గులో ముగ్గురు
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రుల ఖరారు?
బండి సంజయ్ , ఈటల రాజేందర్, కిషన్ రెడ్డిల ధీమా
ధ్వని ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్ జూన్ 8 (న్యూస్ బ్యూరో):ప్రధానిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అవకాశం ఇస్తూ దాదాపు 50 మందితో మోదీ తొలి కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఎవరికి అవకాశం దక్కుతుందనే సంకేతాలు అందుతున్నాయి. మలి విడత విస్తరణలో మరి కొందరు ఆశావాహులకు ఛాన్స్ దక్కుతుందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు.తెలంగాణలో ఈ సారి బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకంది. ఇప్పటి వరకు కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ సారి తెలంగాణలో రెండు నుంచి మూడు స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీల్లో ఆశలు పెరుగుతున్నాయి. కిషన్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి ఖాయమనే చర్చ వినిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి రెండోసారి సిట్టింగ్ స్థానాలను నిలుపుకున్నారు.తొలి విడత ఇద్దరికే మల్కాజిగిరి నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్, ఆది నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి విజయ దుందుభి మోగించారు. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ గెలుపొందారు. వీరంతా రాష్ట్రానికి సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. వీరిలో ఒకరిద్దరు మినహా ప్రస్తుతం గెలిచిన వారందరూ సీనియర్లే కావడంతో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. తొలి విడతలో ఇద్దరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు కిషన్ రెడ్డి..ఈటల రాజేందర్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విస్తరణ సమయంలో మరో ఇద్దరికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కిషన్ రెడ్డికి ఖాయమని చెబుతున్న సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ అదే సామాజిక వర్గానికి చెందటంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, పార్టీ భవిష్యత్ ను పరిగణలోకి తీసుకొని నిర్ణయం ఉంటుందని ఢిల్లీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
.