ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు
విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
అమరావతి ,(ధ్వని న్యూస్ ):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు ఈనెల 12న గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇతరుల వాహనాల పార్కింగ్‌కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ హరీశ్ కుమార్ గుప్త తెలిపారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవి చంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్.బాగ్చి, ఆర్అండ్బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, సివిల్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, డిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ, డీఐజీ రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, పీఆర్ అదనపు డైరైక్టర్ ఎల్.స్వర్ణలత, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం టైం మారింది అంటూ వచ్చిన సమాచారం అవాస్తవం. 12 తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. ఏపీ సీఎంవో పేరుతో వచ్చిన ట్వీట్లో ఉదయం 9.27 గంటలకు ప్రమాణ స్వీకారం అని తప్పుగా పోస్ట్ చేశారని, ప్రమాణ స్వీకారం 12 తేదీ ఉదయం 11.27 గంటలకే అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.