నిరంతర రచనా పథికుడు ‘దాశరథి’
( దాశరథి రంగాచార్య వర్థంతి సందర్భంగా ధ్వనికి ప్రత్యేకo)
( ఏనుగుల వీరాంజనేయులు. సీనియర్ జర్నలిస్ట్)
‘దాశరథి’”నేను కత్తీ,డాలూ పట్టుకోలేను.సాయుధుడినై ఎదిరించలేను.నా పెన్నే నా గన్ను” అని చాటిన ఘనాపాటి దాశరథి రంగాచార్యులు.తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన ధీరుడు.ఆయన బాల్యం నుంచి మొదలుకుని చివరి శ్వాస వరకు వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు.ఆయన తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొల్పడానికి,అన్యాయాన్ని ఎదిరించేలా పురిగొల్పడానికి ఇష్టపడేవారు.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నినదించిన దాశరథి కృష్ణమాచార్యులు రంగాచార్యకు స్వయాన అన్న.తెలంగాణ వేదనను,వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్యంలో పలవరించారు.ఆంధ్ర మహాసభ ప్రేరణతో అన్న నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టారు.నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.పగలు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే,రాత్రుళ్లు రైతు కూలీలకు ఉద్యమ బోధన చేసేవారు.ఇంతలో అన్న కృష్ణమాచార్య జైలు పాలుకావడంతో ఇంటి బాధ్యతలన్నీ రంగాచార్య మోయాల్సి వచ్చింది.కుటుంబం ఉద్యమ ప్రభావంలోకి వెళ్లడంతో తండ్రి వెంకటాచార్యులు భార్యబిడ్డలను వదిలేసి వెళ్లిపోయారు.బతుకుదెరువు కోసం తల్లి వెంకటమ్మ హరికథలు చెబితే,రంగాచార్యులు లైబ్రేరియన్‌గా పనిచేశారు.ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో రజాకార్లు పెట్రేగి దాశరథి కుటుంబంపై దాడులు చేశారు.ఆ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన రంగాచార్య తుపాకీ పేల్చడంలో శిక్షణ తీసుకుని రజాకార్లను ఎదురొడ్డి నిలిచారు.1948 సెప్టెంబరు 16న పోలీస్ యాక్షన్ తరువాత రంగాచార్య ఉద్యమం నుండి బయటకొచ్చారు.స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత ప్రజలను పీడించిన దొరలే ఖద్దరు,గాంధీ టోపీ ధరించి రాజకీయ నాయకులుగా అవతారమెత్తారు.రంగాచార్య వారి మధ్య ఇమడలేక పోయారు.స్వయం కృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.తరువాత 1957లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చేరి 1988లో అసిస్టెంట్ కమిషనర్‌గా రిటైరయ్యారు.మారేడ్‌పల్లి మున్సిపల్ ప్లే గ్రౌండ్ పక్కన ఉన్న ఇరుకైన సందులోని మూడు గదుల ఇల్లు ఆయన గడిపిన సాధారణ జీవితానికి అద్దం పడుతుంది.తెలంగాణ సాయుధ పోరాటానికి రంగాచార్య రచనలు ఎంతగానో దోహదం చేశాయి.ఒక లక్ష్యశుద్థితో తన రచనలు కొనసాగించారు.ఆయన సాహితీ సేవ విలక్షణమైనది,విస్త్రతమైనది,విభిన్నమైనది.రంగాచార్య రచనలు భావోద్రేకాలు రగిలించేకన్నా,భావోద్వేగాలు కలిగిస్తాయి.మహా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు ప్రజలపై ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే.ఆళ్వారు స్వామి వదిలి వెళ్లిన రచనా ఉద్యమాన్ని రంగాచార్య తన భుజస్కంధాలపై మోశారు.ఆయన తనదైన పద్ధతిలో తెలంగాణ ప్రజల జీవన చిత్రణ కోసం నవలా రచనకు పూనుకున్నారు.మొత్తం తొమ్మిది నవలలు రాశారు.వీటిలో ‘చిల్లరదేవుళ్లు’,‘మోదుగుపూలు’, ‘జనపదం’ పిరీయాడిక్ నవలలు కావడంతో ఒక నవల ముగింపు మరో నవలకు ప్రారంభమవుతుంది.ఆయన తన తొలి నవల ‘చిల్లరదేవుళ్లు’ను 1969లో వెలువరించారు.రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం ద్వారా నాటి వాతావరణాన్ని,ఆ కాలంలోని బానిస పరిస్థితులను ఈ నవలల్లో విస్పష్టంగా ప్రస్ఫుటీకరించారు.గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను ఈ నవలలో కండ్లకు కట్టించారు.ఈ నవలలోని పీరిగాడు,పాణిమంజరి,ఇందిర పాత్రలు ఆనాటి సమాజంలోని ప్రజలకు ప్రతినిధులు.ఈ నవల 1974లో చలన చిత్రంగా వచ్చింది.‘చిల్లరదేవుళ్లు’1938కి పూర్వపు తెలంగాణ ప్రజల జీవనాన్ని చిత్రిస్తే,తెలంగాణ సాయుధ పోరాటంలోని 1942-48 మధ్య కాలాన్ని ‘మోదుగు పూలు’ నవల వర్ణిస్తుంది.రంగాచార్య నిర్వహించిన పోరాట చిత్రణమే ఈ నవలలోని ఇతివృత్తం.ఈ నవల చదివే చండ్ర రాజేశ్వరరావు రంగాచార్యను ‘ఆంధ్ర గోర్కీ’గా అభివర్ణించారు.ఆయన రాసిన నవలల్లో తెలంగాణ పలుకుబడులను,నుడికారాన్ని పలికించారు.స్వాతంత్య్రం తరువాత రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ‘జనపదం’ నవలలో చిత్రించారు.నగర సమస్యల ఇతివృత్తంతో ‘మాయాజలతారు’ నవల రాశారు.సుదీర్ఘ తెలంగాణ సామాజిక పరిణామాలను తన రచనల్లో ప్రతిబింబించిన రంగాచార్య తన ఆత్మకథను ‘జీవనయానం’పేరుతో తీసుకొచ్చారు.మౌలికంగా ఈ రచన ఆయన స్వీయ చరిత్రే అయినా పాఠకులకు ఎక్కడా స్వోత్కర్ష కనపడదు.తానేమిటో చెప్పేకన్నా,ఒక రచయితగా తన బాధ్యత ఏమిటో జీవనయాత్రలో అవగతం చేశారు.ఈ రచనలో రంగాచార్య తన జీవింతంలో పాటు,ఏడు దశాబ్దాల తెలుగు జాతి జీవనాన్ని చిత్రించారు.బుద్ధుని జీవిత చరిత్రను ‘బుద్ధ భాణుడు’ పేరుతో అపురూపమైన రచనను 2010లో వెలువరించారు.రంగాచార్య నవలలు ఎక్కువగా రాసినా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం అంటే ఆయనకెంతో అభిమానం.రంగాచార్య చేతి నుంచి జాలువారిన కథా సంపుటి ‘నల్లవాగు’.సమర సాహిత్యానికి చెందిన ‘రణరంగం’,‘రణభేరి’,‘జనరంగం’ఆయన రచనలే.తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడైన రంగాచార్య తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు.అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ‘అభినవ వ్యాసుని’గా ఖ్యాతిగాంచారు.వేదాలను అనువాదం చేయడానికి ముందు ఆయన తన వేషధారణ కూడా మార్చుకున్నారు.పంచె కట్టుకోవడం,చొక్కా వేసుకోకుండా శాలువా కప్పు కోవడం,నుదుట నామాలు పెట్టుకోవడం చాలామందిని ఆశ్చర్యపర్చింది.ఇది ఆయన జీవితంలో వైరుధ్యంగా కనిపించిన విషయం.దీనికి ఆయన ‘మతం వ్యక్తిగతమైనది.మార్క్సిజానికి,నా వేషధారణకు,వేదాల అనువాదానికి మధ్య వైరుధ్యమేమీ లేదు” అంటూ నిక్కచ్చిగానే సమాధానమిచ్చారు.ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ చిన్నగూడురులో 1928 ఆగష్టు 24న జన్మించిన రంగాచార్య 2015 జూన్ 8న చనిపోయారు.అయితే ఆయన జన్మించిన మానుకోట నేలకు ధాశరథి జిల్లాగా పేరు పెట్టాలనేది ఈ ప్రాంతవాసుల కోరిక.ఆయన తెలంగాణ సమాజాన్ని తన రచనల త్వారా చైతన్యపరిచిన తీరును నేటితరం రచయితలు,కవులు అధ్యయనం చేసి ఆచరణకు పూనుకోవడమే దాశరథి సోదరులకు మనమిచ్చే నివాళి.