ఎన్ డి ఏ ఏకపక్ష నిర్ణయాలు సాగవు : సోనియా
న్యూఢిల్లీ :లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్రమోదీకి రాజకీయ, నైతిక ఓటమిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. ఈ ఫలితాలతో మోదీ నైతికంగా నాయకత్వ హక్కును కోల్పోయారనీ. ఐనా ఓటమికి బాధ్యత వహించక మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపిలను ఉద్దేశించి ప్రసంగింగించిన ఆమె కొత్త ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రత్యేక బాధ్యత తమపై ఉందన్నారు. దశాబ్ధకాలంగా పార్లమెంటును నచ్చినట్లుగా వాడుకున్నారనీ తాజా ఎన్నికల ఫలితాలతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని సోనియా స్పష్టం చేశారు. చర్చలకు అంతరాయం కలిగించేందుకు, విపక్ష సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించడం, ఏకపక్షంగా చట్టాలను తీసుకురావడం, పార్లమెంటరీ కమిటీలను విస్మరించడం వంటివి ఇకపై జరగవని చెప్పారు.